20, అక్టోబర్ 2012, శనివారం

మార్నింగ్ వాకు, మయూర వీక్షణం




హైదరాబాద్ శివారులోని ఒకానొక కాలనీ లో నా నివాసం.  ఒక వైపు గుట్టలు, మరో వైపు ఒక సరస్సు, మరికొన్ని చెరువులు, ఇంకా చిన్న అడవి లాంటి ప్రాంతంతో పాటు దగ్గరలో కొన్ని పంట పొలాలు కూడా ఉన్నాయి.  ఇక్కడికి వచ్చిన కొత్తలో చుట్టూ తిరిగే వాణ్ని.  అలాంటి విహారాల్లో ఒకసారి దూరంనుండి నెమలి అరుపులు వినిపించాయి.  మరోసారి పనిగట్టుకొని ఆ కేకలు వినిపించిన వైపు వెళ్ళాను.  ఒక పెద్దగుట్టకు ఆనుకొని దట్టంగా పొదలు, చెట్లు పెరిగిన ప్రాంతంలో కనిపించాయి కొన్నినెమళ్ళు.  ఒకసారి ఓ ఫ్రెండ్ చెబ్తే మరోవైపు వెళ్ళాను.  అక్కడ సాయంత్రం పూట HT Towers మీద గుంపులు గుంపులుగా చాలా నెమళ్ళు చేరాయి.  రాత్రంతా అవి అక్కడే ఉంటాయట.  
 
ఇక ప్రస్తుతానికి వస్తే, మార్నింగ్ వాక్ మొదలు పెట్టిన మొదటిరోజే ఆ మయూర స్థావరాల వైపు వెళ్ళాలని అనుకున్నాను.   జేబులో కేమెరతో బయలుదేరాను.  అంటే, మన కేమెర చూసి నెమళ్లన్నీ వరసగా వచ్చి ఫోజులిస్తాయని ఓ పిచ్చి ఆలోచన.   ఆ  ఆలోచన ఎంత పిచ్చిదో తర్వాత తెలిసింది.  మొదటిసారి వెళ్ళిన గుట్టలవైపు వెళ్ళాను.  అక్కడ ఏమీ  కనిపించలేదు.  ఇదిగో ఇదే ఆ ప్రదేశం. 
మొదటిసారి ఈ ప్రాంతంలోనే నెమళ్ళను చూసాను.

వినిపిస్తున్న కూతలను అనుసరిస్తూ ఇంకా ముందుకి వెళ్లాను.  అక్కడ ఒక కొలనుకి అవతల వైపు దూరంగా కొన్ని ఉన్నాయి.  మన కేమెర శక్తి తెలుసు కాబట్టి వాటిని ఫోటో తీసే ప్రయత్నం చేయలేదు.  అయితే, ఆ కొలను మాత్రం తెల్ల కలువలతో చాలా బాగుంది.  ఇదిగో చూడండి.  


      
ఇక, ఆ కొలను పరిసరాల్లో తిరుగుతుంటే, హఠాత్తుగా పక్కనే ఒక పొద వెనుక కలకలం  వినిపించింది.  కేమర సిద్దం చేసుకొనేటప్పటికి ఒక మయూరం పెద్ద శబ్దం చేసుకుంటూ పక్కనే ఉన్న గుట్టల వైపు ఎగిరింది.    క్లిక్ చేశాను కాని, అది ఫ్రేమ్ లోకి రాలేదు.  అప్పటికే అది బండ రాళ్ళ మద్య మాయమైపోయింది. 

వాకింగ్ సంగతేమో గాని, రాళ్ళూ, గుట్టలు ఎక్కి దిగేసరికి బాగా చెమటలు పట్టి ఆయాసం  వచ్చేసింది.  ఇక, తిరిగి వస్తుంటే వెనుక నుండి మళ్లీ కూతలు వినిపించాయి.  ఈసారి అవి నన్ను గేలి చేస్తున్నట్టుగా  అనిపించింది (అంతకు ముందు వాటి అరుపులు వింటుంటే పాపం ఏదో ఆపదలో ఉన్నాయేమో, ఎవరైనా తరుముతున్నారేమో అనిపించేది).

చివరికి ఈరోజు ప్రయత్నిస్తే ఈ క్రింది ఫోటోలు తీయగలిగాను.  నాకు అర్ధమైనది ఏమిటంటే, వీటికి సిగ్గు ఎక్కువ. ఫొటోస్ తీసుకోవడం ఇష్టం ఉండదు.  ఎంతో దూరంగా ఉన్నాసరే మనల్ని పసిగట్టి నెమ్మదిగా ఏ పొద చాటుకో, బండ చాటుకో పోతాయి. ఈ రోజు చూసిన వాటిలో ఒక తల్లి నెమలితో పాటు దాదాపు ఓ డజను వరకు పిల్లలు ఉన్నాయి.  చాలా ముచ్చటగా ఉన్నాయి. చాలా సంతోషం కూడా కలిగింది. 




ఏమిటి, దేనికీ అందమైన పొడవైన తోక లేదు అనుకుంటున్నారా, ఇవి ఆడ పక్షులండి.  ఈ జాతిలో మగవాళ్ళదే కదా అందమంతా.  


ఈ మొత్తం ఎపిసోడ్ లో నేను నేర్చుకున్నదేమిటంటే:
  • స్వేచ్చగా తిరిగే పక్షులను (ముఖ్యంగా నెమళ్ళను) ఫోటో తీయడం అంత ఈజీ కాదు. 
  • మన కేమర తో తీయాలంటే బోల్డంత సమయం, ఓపిక ఉండి ఏ  పొదల చాటునో నక్కి కూర్చుంటే ఫలితం ఉండొచ్చు.
  • మంచి జూమ్ లెన్స్ తో DSLR camera ఉంటే పని సులభంగా అవుతుంది.
  • మామూలుగా వాక్ చేసే బదులు ఇలా కొండలు గుట్టలు తిరిగితే కొవ్వు మరింత ఎక్కువగా కరుగుతుంది.

చివరగా, గూగులమ్మనడిగి తీసుకున్న కొన్ని మయూర చిత్రాలు మీకోసం:



 
  

6 కామెంట్‌లు: